Custard Apple Processing Unit in Mahabubnagar District : మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్ సత్ఫలితాలనిస్తోంది. లక్ష్యం మేరకు.. రైతులకు ప్రయోజనం, మహిళలకు ఉపాధి, సంఘానికి లాభాలు తెచ్చిపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా సీతాఫలాలు లభ్యమయ్యేది మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోనే. ఈ ప్రాంతాల్లో సీజన్‌లో సీతాఫలాల సేకరణే ఉపాధిగా బతికే రైతులు చాలా మందే ఉంటారు.
Custard Apple Bussiness in Mahabubnagar : రైతులు సీతాఫలాలు సేకరించి.. మహబూబ్ నగర్, హైదరాబాద్, షాద్‌నగర్ ఇతర ప్రాంతాల్లో అమ్ముకొని వస్తారు. అందుకు రవాణా ఖర్చులు, ప్రయాణం వారికి అదనపు భారం. తీసుకువెళ్లిన కాయలు అన్ని అమ్మాలని లేదు. మంచి ధర దక్కాలని లేదు అలా కాకుండా ఎక్కడ సేకరించిన పళ్లను అక్కడే కొనుగోలుచేసి, అక్కడే ప్రాసెసింగ్ చేస్తే మేలు జరుగుతుంది. అందులో భాగంగా నవాబుపేటలో నాలుగేళ్లు క్రితం సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించారు.
custard apple benefits: సీతాఫలంలో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా?
Custard Apple Production in Mahabubnagar : నవాబుపేట ప్రాసెసింగ్ యూనిట్‌కి చుట్టుపక్కల ఉన్న ఏడెనిమిది గ్రామాల నుంచి రైతులు సీతాఫలాలు సేకరిస్తారు. అందుకోసం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. తద్వారా మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన రవాణా ఖర్చులు, ప్రయాణ భారం తప్పుతాయి. రైతుల నుంచి సేకరించిన పండ్లను నవాబుపేటలో ప్రాసెస్ చేస్తారు. వాటిని మాగబెట్టి గుజ్జు తీస్తారు. గుజ్జును శీతలీకరణ యంత్రాల్లో నిల్వ చేసి కావాల్సిన పరిమాణంలో తయారయ్యాక వాటిని ఐస్ క్రీం కంపెనీలకు విక్రయిస్తారు. అందుకోసం షిఫ్టుకు 25 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేస్తారు. ఒక సీజన్‌లో 45 రోజుల వరకు మహిళలకు ఉపాధి లభిస్తోంది. గుజ్జును ప్రాసెస్ చేసి వెయ్యి కిలోలు అమ్మడం ద్వారా.. రూ.2లక్షల వరుకు లాభం వచ్చిందని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు.
సీతాఫలాలు అమ్మడం కంటే ఇలా చేస్తేనే లాభం...!!
"రైతులు ఉదయాన్నే మా దగ్గరకు వచ్చి సీతాఫలాలు అమ్ముతారు.. దీనివల్ల సాయంత్రంలోపు మరోసారి అమ్మే అవకాశం ఉంది. ఒక పండుకు గతేడాది రూ.12 ఇచ్చాం.. ప్రస్తుతం రూ.20 వరకు ఇస్తున్నాం. రైతులు ఎన్ని సీతాఫలాలు తెచ్చినా.. మేము తీసుకుంటున్నాం."-మహిళా సంఘం సభ్యురాలు
Womens Associations Start Custard Apple Processing Unit : నవాబుపేట సీతాఫల్ ప్రాసెసింగ్ యూనిట్ దిగ్విజయంగా నడవడం ద్వారా రైతులకు మేలు జరిగేలా.. మహిళలకు ఉపాధి, సంఘానికి లాభాలు తెచ్చిపెట్టే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని అంటున్నారు. సీజన్‌లో మాత్రమే కాకుండా ఏడాదంతా ఉపాధి లభించేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సంఘంలోని మహిళలు కోరుతున్నారు.