కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... పేద ప్రజల కోసం కొవిడ్ ఆన్లైన్ క్లీనిక్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ ప్రాంతంలో ఏర్పాటు చేశామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్త్యాల అన్నారు. ఇక్కడి ప్రజలకు ఆన్లైన్ ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అత్యుత్తమ వైద్యం..
మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు పీహెచ్సీ, మక్తల్ ఆసుపత్రితో పాటు పులిమామిడి, నర్వ, అమరచింతలోని పీహెచ్‌సీలతో పాటు మాద్వార్, చిన్న పొర్ల గ్రామాల్లో కొవిడ్ పరిస్థితులను పరిశీలించారు. టెలీమెడిసిన్ ద్వారా పీహెచ్‌సీల్లోని కొవిడ్ రోగులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్ హరిచందనతోపాటు కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌ను చూస్తున్న మంత్రి కేటీఆర్, సెక్రటరీ జయేశ్ రంజన్‌కు అన్ని పీహెచ్సీలలోని సౌకర్యాల నివేదికను సమర్పిస్తామన్నారు.
ఆక్సిజన్ పూర్తిస్థాయిలో..
ముఖ్యంగా మక్తల్ ప్రాంతంలోని కొవిడ్ రోగులు మహబూబ్‌నగర్, రాయిచూర్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళుతున్నారని సందీప్ మక్త్యాల అన్నారు. ఆక్సిజన్ సౌకర్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించామన్నారు. అతిత్వరలో మక్తల్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
అమెరికా ఇండియన్ అసోసియేషన్- టీటా సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఐటీరంగ వైద్య సేవలను పేద ప్రజలకు పూర్తి ఉచితంగా అందించడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు పార్వతి, శ్రీకాంత్, ఇతర సిబ్బంది, టీటా సిబ్బంది ఇలియాజ్, సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి