Cotton Farmers Problems Due To No Rains : జూన్ మొదలై పక్షం రోజులు గడుస్తున్నా, తగ్గని అధిక ఉష్ణోగ్రతలు విత్తన పత్తి, సాధారణ పత్తి సాగుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటికే సాగుచేసిన పత్తి పంటలను రైతులు ఎక్కడికక్కడ పెరికి వేస్తున్నారు. వేసిన పంట ఎండలకు ఎండిపోవడం, ఎర్రబారడం, ఎదుగుదల లేకపోవడం అందుకు ప్రధాన కారణం. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో విత్తన పత్తిని సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గద్వాల మల్దకల్, దరూరు కేటిదొడ్డి, గట్టు మండలాల్లో విత్తన పత్తి సాగు అధికంగా ఉంటుంది. ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలను ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో బోరు బావుల మీద ఆధారపడి సాగు చేస్తారు. వర్షాలు కురిసే నాటికి పంట ఎదిగి ఏపుగా పెరుగుతుంది. కానీ ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మొక్కలు ఎర్రబారి పోతున్నాయి. ఎదుగుదల కూడా మందగించింది. దీంతో వేసిన పంట పనికి రాదని దిగుబడి సైతం ఆశించిన మేర ఉండదని భావించి రైతులు వేసిన పంటను పెరికి వేసి మరోసారి విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
Cotton Farmers Problems Due To High Temperatures : ఏప్రిల్, మే నెలలో సాగు చేసిన పత్తికి ఎకరాకు రూ.30 నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడులు పెట్టామని.. 15 రోజుల నుంచి 40 రోజుల వరకు పంట కాలాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి నష్టపోగా.. మళ్లీ అదే స్థాయిలో తిరిగి అప్పులు చేసి పంట సాగు చేయాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే దాదాపు 30 వేల ఎకరాల్లో విత్తనపత్తి పంటలను రైతు నష్టపోవాల్సి వస్తుంది అని అంచనా.
జిల్లాలో సాధారణ పత్తి దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తారు. ఈసారి వాతావరణ పరిస్థితి ముందస్తుగా అంచనా వేయకుండా.. ఎప్పటిలాగే రైతన్నలు మే నెలలో పత్తిసాగుకు మొగ్గు చూపారు. దున్నకాలు, విత్తనాల కోసం డబ్బులు ఖర్చు చేశారు. కానీ సకాలంలో నీరు అందక ఉష్ణోగ్రతలు పెరిగి మొక్కల ఎదుగుదల కనిపించడం లేదు. సగం పంటయినా చేతికి వస్తుందని ఎదురుచూసినా.. ఇప్పటివరకు చినుకు రాలడం లేదు. గత్యంతరం లేక పత్తి పంటలు పెరికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదంటూ అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ఏప్రిల్, మే మాసాల్లో ముందుగానే పత్తిని నాటడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల కావలసిన పోషకాలు అందక మొక్కలు ఎర్రబారిపోతాయని.. సకాలంలో తడులు అందించకపోతే ఎండిపోతాయని చెబుతున్నారు. పత్తిసాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించి.. అండగా నిలవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: