లాక్‌డౌన్ సడలింపులతో సుదూర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. అమరచింత పురపాలికకు వైజాగ్, కర్ణాటక నుంచి వచ్చిన ఇద్దరికి వైద్యాధికారి ప్రవీణ్ వైద్య పరీక్షలు చేశారు. రక్త నమూనాలు సేకరించారు. 14 రోజులు హోం క్వారంటైన్‌లో తప్పనిసరిగా ఉండాలన్నారు. మదనాపురం మండలంలోని వివిధ గ్రామాలు, తండాలకు ముంబయి నుంచి 10 మంది ఆదివారం సొంతూరికి రావడంతో వారందరికీ సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పీహెచ్‌సీ పర్యవేక్షకురాలు ప్రమీల తెలిపారు. వారికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని పేర్కొన్నారు. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తహసీల్దార్ సింధూజ సూచించారు.
లాక్‌డౌన్ సడలింపుతో మహారాష్ట్ర లోని ఠానే, పుణె, ముంబయి నగరాల నుంచి 55 మంది వలస కార్మికులు మండలంలోని వివిధ తండాలకు చేరుకున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ బస్సు నేరుగా బుద్దారం గ్రామానికి చేరుకున్నది. విషయం తెలుసుకున్న తహసీల్దారు నరేందర్ వచ్చి వారి వివరాలను నమోదు చేసుకుని పరీక్షించారు. అందరూ హోం క్వారంటైన్ పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం తరలింపు