ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 18 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటి వరకు తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 288కి చేరింది. అత్యధికంగా వనపర్తి జిల్లాలో 9 పాజిటివ్ కేసులు కాగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 6 మంది, నాగర్‌కర్నూల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన ఆరు కేసులు పట్టణానికి చెందినవే కావడం గమనార్హం.
మహబూబ్‌నగర్‌లోని సుభాష్‌నగర్‌లో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న తల్లీకూతుళ్లకు కరోనా సోకింది. టీడీగుట్టలో ఉండే మహిళ హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాంనగర్‌లో ఓ మహిళకు కరోనా సోకింది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న ఆమె భర్తకు ఇదివరకే కరోనా పాజిటివ్ వచ్చి.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. పద్మావతి కాలనీకి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న సంజయ్‌నగర్‌లో ఉండే కానిస్టేబుల్ కరోనా బారిన పడ్డారు.
వనపర్తి జిల్లాలో నమోదైన తొమ్మిది కేసుల్లో జిల్లా కేంద్రంలోనే ఆరు కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇదివరకే కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి పట్టణంలోని రాయిగడ్డకు చెందిన ఒకరికి.. బ్రహ్మంగారి వీధిలో ఉండే మరొక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. పట్టణంలోని నందిహిల్స్‌కు చెందిన ఓ వృద్దుడికి, పెద్దమందడి మండలం మద్దిగట్లకు చెందిన ఓ వృద్దురాలికి కరోనా సోకింది. కొత్తకోట పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఖిల్లాఘనపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఏఎన్‌ఎంతో పాటు ఆమె భర్తకు కూడా కరోనా నిర్ధరణయ్యింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్స్‌కు పాజిటివ్ రాగా.. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి, తిమ్మాజిపేట మండలం గుమ్మకొండకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణయ్యింది. ఇక జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదు కాలేదు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్