ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన పంటలను సాగు చేస్తేనే మద్దతుధర కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని అధికారులు రైతులకు అవగాహన కల్పించే చర్యలు మొదలు పెట్టారు. అనవసర పంటలు సాగుచేసి రైతులు నష్టపోవద్దంటూ అన్నదాతలకు వివరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయా పంటల సాగువిస్తీర్ణంపై కర్షకుల్లో నెలకొన్న గందరగోళం మాత్రం వీడటం లేదు. అధికారులు చెప్పినట్లుగా పంటలు సాగుచేస్తే ఆశించిన దిగుబడి వస్తుందా అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి.
కూలీల కొరత అధిగమించేదెలా?
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని వివిధ గ్రామాల రైతులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మొక్కజొన్న కాకుండా పత్తి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని, పత్తి తీసేపటప్పుడు కూలీల కొరత తీవ్రంగా ఉంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు ఇప్పటివరకు వివిధ గ్రామాల్లోని రైతుల నుంచి సేకరించిన మట్టినమూనాల ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది.
ఏయే పంటలు సాగు చేయాలి?
ఇప్పటిదాకా అధికారులు రూపొందించిన పంటల సాగు ప్రణాళికలో కేవలం జిల్లా యూనిట్‌గా పేర్కొన్నారు. గ్రామస్థాయిలో రైతులు ఏయే పంటలు సాగుచేయాలో సమగ్ర వివరాలు లేవు. ప్రస్తుతం గ్రామాల్లో సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలోనే గ్రామస్థాయిలో రైతులు సాగుచేసే పంటలపై స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.