Congress Public Meeting at Jadcherla Today : కర్ణాటక ఎన్నికల ఫలితాలతో జోష్ మీదున్న కాంగ్రెస్... రాష్ట్రంలోనూ విజయబావుటా ఎగురవేయాలని భావిస్తోంది. ఇందుకోసం తరచుగా సభలు, సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఒకవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తుండగా... మరోవైపు పీసీసీ నేతృత్వంలో సభలతో జనానికి చేరువ కావాలని నిర్ణయించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 800 కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భారీ సభను ఇవాళ నిర్వహించనున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభను హస్తం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తాం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉదండపూర్, వల్లూర గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజల్ని భయ బ్రాంతులకు గురి చేసి... ప్రాజెక్టుల కోసం భూములు లాక్కుంటోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తామని నిర్వాసితులకు భట్టి భరోసా ఇచ్చారు.
ఇవాళ జడ్చర్లలో భారీ బహిరంగ సభ : భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నిర్వహిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఇవాళ భారీ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుకు హాజరు కానున్నారు. ఇదే తరహాలో ప్రతి రెండు, మూడు వారాలకు ఒక సభను రాష్ట్రంలో నిర్వహించాలని.... ఆ సభలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలైన ప్రియాంక, రాహుల్ గాంధీలతో పాటు ఇతర జాతీయ స్థాయి నాయకులను ఆహ్వానించాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్నికల సమయానికి వీలైనన్ని ఎక్కువ సభలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే భారీ సభలతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం తీసుకొచ్చే దిశగా పీసీసీ ప్రణాళికలు రచిస్తోంది.
సభలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే : జడ్చర్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కిీలక నేతలు పాల్గొననున్నారు. ఈ సభ కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. సాయత్రం 4 గంటలకు గద్దర్ సాంసృతిక కార్యక్రమాలతో బహిరంగసభ ప్రారంభంకానుంది. నేతలకు భారీ స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి.
ఇవీ చదవండి :