భారత్-చైనా సరిహద్దులో అమరులైన సైనికులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళి అర్పించారు. గాంధీనగర్ వీధిలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి మౌన దీక్ష చేశారు. అంతకుముందు డీసీసీ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు నాయకులు పాదయాత్ర చేశారు.
శత్రువుల ఇంట్లోకి వెళ్లి బుద్ధి చెపుతామని ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తమాటలు చెప్పిన ప్రధాని మోదీ... భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చెప్పడంలో అర్థం ఏమిటని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గాల్వన్ లోయ అసలు ఇప్పుడు భారత భూభాగంలో ఉందా...? చైనా దురాక్రమణలో ఉందా? అన్న అంశంపై ప్రధాని మోదీ ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు బండి వేణుగోపాల్, జి.సుధాకర్, మాజీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ గౌస్, పట్టణ అధ్యక్షులు శశికాంత్ చమకురా, కౌన్సిలర్ మహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.