విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు సస్పెండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హన్వాడ, పెద్దదర్పల్లి, జానంపేట, గాజులపేట పంచాయతీల్లో కార్యదర్శులు సమయపాలన పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం కలెక్టర్ గమనించారు. వెంటనే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులను పాలనాధికారి సస్పెండ్ చేశారు.
మహబూబ్‌నగర్ మండలం అల్లిపూర్, గాజులపేట, జానంపేట తదితర గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారం మొక్కలకు నీరు పెట్టడంతోపాటు క్రీమేటోరియం, జడ్చర్ల మండలం నాగసాలలో చౌకధర దుకాణంలను కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు. హరితహారం ద్వారా నాటిన మొక్కలకు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం నీరు పెట్టాలని ఆదేశించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అన్నారు.
ఇదీ చూడండి : మైనర్పై అత్యాచారం.. నిందితుడికి జీవిత ఖైదు