CM KCR Palamuru Tour: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన బయలు దేరనున్న కేసీఆర్ నేరుగా మహబూబ్ నగర్ చేరుకోనున్నారు. పట్టణ శివారులోని పాలకొండ వద్ద 22ఎకరాల్లో 55 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అక్కడే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పట్టణంలో నిర్మించిన కొత్త టీఆర్ఎస్ జిల్లా కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
అక్కడ అరగంట ఉండి పార్టీ శ్రేణులతో ముచ్చటించనున్నారు. తర్వాత నేరుగా ఎమ్వీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షించారు.
బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులకు మంత్రి సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా మహబూబ్ నగర్ గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రధాన రహదారులు ఫ్లెక్లీలతో నిండిపోయాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులంతా బహిరంగ సభలో పాల్గొననున్నారు. భారీ జనసమీకరణలో తెరాస శ్రేణులు నిమగ్నమయ్యాయి. సభకు లక్ష మందికి పైగా తరలించేలా ప్రణాళిక రూపొందించారు.
సీఎం పర్యటనను కుదించారు. ముందుగా కొత్త కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మినీ శిల్పారామం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన, మయూరి పార్కు సందర్శనతో పాటు బహిరంగ సభ ఉంటుందని భావించారు. జిల్లా మంత్రితో పాటు అధికారులు ఆ విధంగానే ఏర్పాటు చేశారు. కేసీఆర్ పట్టణం గుండా ప్రయాణించే అవకాశాలు ఉండడంతో రోడ్లను బాగుచేశారు. డివైడర్లకు రంగులు అద్దారు.
సాయంత్రం తర్వాత కేసీఆర్ పర్యటనను కుదించినట్లు జిల్లా నేతలు, అధికారులకు సమాచారం వచ్చింది. మినీ శిల్పారామం, సూప్ స్పెషాలిటీ ఆసుపత్రి, మయూరి పార్కును షెడ్యూల్ నుంచి తీసేశారు. సీఎం పర్యటనను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, బీజేపీ సహా ఆందోళనలు చేస్తారని భావించే వారిని ముందస్తు అరెస్టు చేశారు. సీఎం పర్యటనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఇవీ చదవండి: