CM KCR Praja Ashirvada Sabha at Achampet : కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే.. అందరి జీవితాలు బాగుపడతాయని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting in Achampet)లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
తెలంగాణ ప్రయాణం పదో సంవత్సరంలో ఎన్నికలు వచ్చాయని.. కానీ అంతకంటే ముందే 24 ఏళ్ల క్రితమే తాను ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదన్నారు. ఇప్పుడు తెలంగాణ కోసం తన పోరాటం అయిపోయిందని.. ఇక చేయాల్సింది ప్రజలేనని హితవు పలికారు.
BRS Public Meeting in Achampet : "కొందరు నాయకులు కొడంగల్‌కు రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని సవాల్ విసురుతున్నారు. రైతుబంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్. రైతుబంధును దశలవారీగా రూ.16 వేలకు పెంచుతాం. అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తాం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ నేతలు 109 కేసులు వేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందనే కేసులు వేసి అడ్డుకుంటున్నారు. ఎవరు గెలిస్తే.. తెలంగాణ ముందుకు వెళ్తుందో వారినే గెలిపించాలి. ఉన్న తెలంగాణను పోగొట్టిందే కాంగ్రెస్. తెలంగాణ ఇస్తామని 2004లో ప్రకటించి.. 2014లో ఇచ్చారు. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తీసుకువచ్చాము. ధరణి ఉండడం వల్ల రైతు బంధు, ధాన్యం డబ్బులు వేగంగా వస్తున్నాయి. ఎవరి పైరవీలు లేకుండా 15 నిమిషాల్లో భూములు రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ధరణి రద్దు చేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని" కేసీఆర్ తెలిపారు.
పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సరిపడా కరెంటు లేక, తాగునీరు, సాగునీరు లేక ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజలు ముంబయికి వలస పోయినప్పుడు ఎవరైనా వచ్చారా అంటూ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు దేశం మొత్తంలో 24 గంటల కరెంటును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సగర్వంగా చెప్పుకున్నారు.
"ఒకరు కొడంగల్‌కు రా.. మరొకరు గాంధీ బొమ్మ దగ్గర రా.. అంటారు ఇదేనా రాజకీయం. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ఎప్పుడైతే ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో.. అప్పుడే బతుకులు బాగుపడతాయి. కేసీఆర్ దమ్ము సంగతి ఇండియా మొత్తం చూశారు. కర్ణాటక రైతులు వచ్చి కొడంగల్, గద్వాలలో విద్యుత్ కావాలని ధర్నాలు చేస్తున్నారు." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
CM KCR Speech at Achampet BRS Public Meeting : అయితే 24 గంటలు రాష్ట్రంలో కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని ఆనాడు జానారెడ్డి సవాల్ విసిరారని గుర్తు చేశారు. 24 గంటల కరెంటు ఇచ్చి చూపించాక వారి సవాల్ ఏమైందని అన్నారు. ఇంటింటికీ నల్లానీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని అన్నారు. 60 లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3 కోట్ల టన్నులు పండిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని సీఎం కేసీఆర్ ఆనందించారు. వీటితో కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందని.. కొత్తగా చూపాల్సిన అవసరం ఏమీ లేదన్నారు.
CM KCR Speech at Medchal Public Meeting : "హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తాం"