పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా... మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉదండపూర్ జలాశయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 18వ ప్యాకేజీ పనుల్లో భాగంగా ఆరో కిలోమీటర్ నుంచి 15వ కిలోమీటరు వరకూ కట్ట నిర్మాణానికి నల్లమట్టి అవసరం. అందుకోసం జడ్చర్ల, నవాబుపేట, రాజాపూర్ మండలాల్లోని 21చెరువుల నుంచి నల్లమట్టి తవ్వుకునేందుకు నీటి పారుదలశాఖ అనుమతులు ఇచ్చింది. కనిష్ఠంగా 3అడుగుల మేర వదిలి, ఆపైన నల్లమట్టిని మాత్రమే తరలించాలని నీటిపారుదలశాఖ నిబంధనలు విధించింది. గ్రామ పంచాయతీ తీర్మానం తప్పనిసరని, నల్లమట్టి తప్ప ఇంకేమీ తవ్వకూడదని, కట్టకు దగ్గరగా తీయకూడదని, తవ్విన మట్టిని ఉదండపూర్ జలాశయం కట్ట నిర్మాణానికి మాత్రమే వినియోగించాలని నిబంధనల్లో సూచించారు. అయితే నిబంధనలన్నీ గాలికి వదిలేసి.... గుత్తేదారులు తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తవ్వేస్తున్నారు
రాజాపూర్ మండలంలోని ఈడీగానిపల్లి, చెన్నవెల్లి, కుచర్ కల్ గ్రామాల్లో నల్లమట్టిని ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. చెన్నవెల్లిలో కట్టకు దగ్గర్లోనే సుమారు 10 అడుగుల లోతులో నల్లమట్టిని తవ్వి తరలించారు. తూము లెవల్ కంటే ఎక్కువ లోతు తవ్వద్దనే నిబంధన ఉన్నా పట్టించుకోలేదు. ఎంతవరకు నల్లమట్టి ఉంటే అంతవరకు తవ్వకాలు జరుపుతున్నారు. మట్టి తరలింపులపై ఫిర్యాదులు అందగా... రాజాపూర్ తహశీల్దార్ శంకర్... ఈడిగానిపల్లి చెరువును సందర్శించారు. నీటి పారుదల శాఖ, రెవెన్యూ సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి తరలించారని తేలిందని..... దీనిపై నివేదిక కోరినట్లు రాజాపూర్ తహశీల్దార్ శంకర్ వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా
నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలకు మైనింగ్ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ మహబూబ్‌నగర్ జిల్లాలో 21 చెరువుల్లో మట్టి తవ్వకాలపై మైనింగ్ శాఖకు సమాచారం లేకపోవడం శాఖల మధ్య సమన్వయ లోపాలను బయటపెడుతోంది. మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లుగా తమ దృష్టికి రాలేదని మహబూబ్ నగర్ జిల్లా మైనింగ్ శాఖ ఇన్‌ఛార్జి ఏడీ విజయ్ కుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలి వెళ్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పర్యవేక్షణ లేదని ఆరోపణలు
మట్టిని తరలించేందుకు గుత్తేదారు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లిస్తానని అంగీకరించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పనులకు మాత్రమే తరలిస్తున్నప్పుడు అలాంటి ఒప్పందాలు ఎందుకనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి తరలింపుపై నీటి పారుదలశాఖ పర్యవేక్షణ లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇదీ చూడండి: kharif cultivation: ఖరీఫ్ సాగు లక్ష్యం 1.40 కోట్ల ఎకరాలు