Komatireddy Rajagopal Reddy criticizing BRS: కేసీఆర్ సర్కారును గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు కిందిస్థాయి నుంచి పనిచేయాలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలపునిచ్చారు. బీజేపీ మహబూబ్‌నగర్ నియోజక వర్గ పాలక్ హోదాలో ఆయన మహబూబ్‌నగర్, హన్వాడ, మహబూబ్‌నగర్ పట్టణంలోని బూతుస్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి మునుగోడుకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తానో, అంతే ప్రాధాన్యం మహబూబ్‌నగర్‌కు ఇస్తానని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచక, అహంకార పూరిత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని రాజగోపాల్ రెడ్డి హితవు పలికారు. మంత్రి అవినీతి, దోపిడి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలన్నారు. కేసులకు భయపడవద్దని సూచించారు. తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని నాటకాలాడినా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
"ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని భావించి కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పెట్టి కొత్త నాటకం ఆడుతున్నారు. తెలంగాణను అప్పులు పాలు చేసి, ప్రాజెక్టులు మీద దోచుకుని దివాలా తీయించి ఇప్పుడు బీఆర్ఎస్ అనే కొత్త నాటకం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ పాలన మాకు వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారు. బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యం. తెలంగాణ ప్రజలు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లాను కూడా సమన్వయం చేసుకుంటాను. ఇక్కడున్న మంత్రి అహంకార పూరితంగా, అరాచకంగా మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో పరిపాలన సాగిస్తున్నారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. ఈ కల్వకుంట్ల కుటుంబ నియంత్రణ పాలనకు చరమగీతం పాడాలి." - కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీజేపీ నేత
ఇవీ చదవండి: