ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెరాస నాయకులు... ఆ తర్వాత ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఒక్కసారి భాజపాకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్, మహబూబ్నగర్ మున్సిపాలిటీల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హామీల వర్షం కురిపించిన తెరాస నేతలు ఆ తర్వాత ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది తప్ప రాష్ట్రానికి ఒరిగిందీ ఏమీ లేదన్నారు.
యువతకు ఉద్యోగాలు, పేదలకు రెండు పడక గదుల ఇళ్ల లాంటి హామీలు నిలబెట్టుకోలేదని లక్ష్మణ్ విమర్శించారు. కేంద్రం ఇళ్లు మంజూరు చేసినా వాటిని పేదలకు అందించ లేదని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటేసినా, తెరాసకు ఓటేసినట్లేనని అన్నారు. హస్తం పార్టీ నుంచి గెలిచిన వాళ్లంతా తెరాసలోనే చేరుతున్నారని ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు వేసిన ఓటు వృథా కాకుండా ఉండాలంటే భాజపాకు ఓటు వేయాలని సూచించారు.