ఈడీ నోటీసులకు కాంగ్రెస్ పార్టీ బెదరదని, కేంద్రంలో మోదీని గద్దె దించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సోనియా, రాహుల్‌గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మహబూబ్‌నగర్ పోస్టాఫీసు ఎదురుగా చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్యంగబద్ధ సంస్థలను రాజకీయ పార్టీలపై కక్ష సాధింపు చర్యల కోసం కేంద్రం వినియోగిస్తుందని భట్టి మండిపడ్డారు. నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా రెండూ కాంగ్రెస్ పార్టీకి చెందినవని, వాటితో చట్టబద్ధంగానే లావాదేవీలు జరిగాయని గుర్తు చేశారు. మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా నోటీసులు ఇచ్చినందునే ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు దేశవ్యాప్త నిరసనలు చేపట్టామని స్పష్టం చేశారు. మోదీ ఈడీ బెదిరింపులకు సోనియా, రాహుల్ భయపడరన్నారు.
మోదీ అధికారంలోకి వచ్చాక రూ.40 లక్షల కోట్ల అప్పులు చేసి.. దేశాన్ని తాకట్టు పెట్టారని భట్టి విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్మేస్తూ.. అంబానీ, అదానీ లాంటి వ్యాపారస్థులకు మేలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా అంటే.. దళారుల పార్టీగా, వ్యాపారస్థుల పార్టీగా మార్చేశారన్నారు. మోదీ సంగతి తేల్చే వరకు.. రాహుల్ ప్రధాని అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని.. రాహుల్ పాదయాత్ర 'భారత్ ఛోడో'ను విజయవంతం చేస్తామని భట్టి స్పష్టం చేశారు.
మోదీ ఈడీ బెదిరింపులకు సోనియా, రాహుల్ గాంధీలు భయపడరు. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా కంపెనీలలో మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందో మోదీ చెప్పాలి. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాం. మోదీ సంగతి తేల్చే వరకు.. రాహుల్ ప్రధాని అయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది.-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇవీ చూడండి..
Lovers Suicide : నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య
'వామ్మో మైక్ టైసన్.. నా బిడ్డకు దెబ్బలు తగులుతాయ్'.. విజయ్ దేవరకొండ తల్లి ఆందోళన