ఈ నెల 2న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, సిబ్బందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నలుగురు నిందితులను ఈరోజు జడ్చర్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నాటుసారా అమ్మకాలపై సోదాలు చేసేందుకు వెళ్లిన అధికారులపై దాడి ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నాటు సారా తయారీపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన నాటుసారాతో పాటు తయారు చేసే ముడిసరుకులను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 2న అర్ధరాత్రి వచ్చిన సమాచారం మేరకు జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, మండలంలోని కిష్టారం గ్రామ సమీపంలో ఉన్న ఒంటి గుడిసె తండా వద్ద తనిఖీలు చేస్తుండగా... అదే తండాకు చెందిన నలుగురు నిందితులు కర్రలతో దాడి చేసి అధికారులను తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను పరామర్శించారు. నిందితులను అరెస్టు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో జడ్చర్ల పోలీసులు తండాకు చెందిన రాజు, పాండు నాయక్, నరేష్ అనే నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: వడగళ్ల వాన పడుతున్నా.. 'క్యూ'లోనే మందుబాబులు