ప్రభుత్వ పాఠశాలలో గదులు లేక ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించే దృశ్యాలు కోకొల్లలు. కానీ మహబూబ్ నగర్ పట్టణంలోని హరిజనవాడలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఏకంగా తరగతి గదిలోనే శౌచాలయాలు నిర్మించారు. ఇదేదో వినడానికి కొత్తగా ఉన్నా... వీటివల్ల పిల్లలు మాత్రం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వాసన వస్తున్న కారణంగా తరగతి గదిలోని శౌచాలయాలను ఉపయోగించట్లేరు. పాఠశాలలో మరిన్ని మూత్ర శాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు ప్రతి రోజు అవస్థలు పడుతున్నారు.
2014-15 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలకు సర్వ శిక్ష అభియాన్ నిధుల కింద మరుగుదొడ్లు, మూత్రశాలలు మంజూరు చేశారు. అయితే అప్పటికే కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నాయి. ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో కొత్తగా కట్టడానికి స్థలం లేకపోయినప్పటికీ... నిధులు వెనక్కిపోతాయనే భయంతో తరగతి గదుల్లోనే శౌచాలయాలు ఏర్పాటు చేశారు అప్పటి ప్రధానోపాధ్యాయుడు.
వీటి వల్ల విద్యార్థులు మూత్రశాలల పక్కనే కూర్చొని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాసన వస్తున్నందున బయట కూర్చుందామన్న స్థలం లేకపోవడం వల్ల పిల్లలు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉన్నవే చిన్న గదులు... అందులో ఇలా మూత్రశాలలు నిర్మించడం వల్ల పిల్లలు గదుల్లో కూర్చోలేకపోతున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తరగతి గదిలో ఉన్న మరుగుదొడ్లను తొలగించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: మిట్టమధ్యాహ్నం మహిళ మెడలోంచి గొలుసు చోరీ