తుంగభద్ర పుష్కరాల నిర్వాహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలకు లోబడి పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. పుష్కరాలకు రావాలనుకునే భక్తులు.. కొవిడ్ నెగటివ్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలి. లేదంటే.. పుష్కర ఘాట్లు, ఆలయాల వద్ద ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి.. సాధారణ శరీర ఉష్ణోగ్రతలుంటేనే ఘాట్లలోకి అనుమతిస్తారు. ఇక మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి. నిబంధనలకు లోబడే పుష్కర స్నానానికి అనుమతిస్తారు.
స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
ఈ నెల 20వ తేదీ నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో సౌకర్యాలు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలోని నాలుగు ఘాట్‌ల వద్ద పుష్కర స్నానం చేసేందుకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా అలంపూర్ ఘాట్ వద్ద దుస్తుల మార్పిడి గదులు, జల్లు స్నానం, నదిలో రక్షణ కంచె, పుష్కర ఘాట్‌పై ఎల్‌ఈడీ దీపాలు, ఆలయ ఆవరణ మొత్తం భారీ విద్యుత్తు దీపాలను అదే విధంగా పిండ ప్రదానానికి ప్రత్యేకంగా పుష్కర్ ఘాట్ కింది భాగంలో ఏర్పాట్లు చేశారు. పుష్కర స్నానం చేసిన భక్తులు నేరుగా జోగులాంబ దర్శనం చేసుకునేందుకు క్యూలైన్లు సిద్ధమయ్యాయి.
ఆలయాల ప్రాంగణంలో చలువ పందిళ్లు, మంచి నీటి ఏర్పాటు, ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 12 మంది ఈవోలతోపాటు సిబ్బందిని హైదరాబాద్, ఉమ్మడి జిల్లాల ఆలయాలను నుంచి విధులకు తీసుకున్నారు. రోజూ పుష్కర స్నానానికి 30 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు అలంపూర్ ఆలయాల ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఘాట్‌ల వద్ద ప్రతి రోజు రాత్రి 7.30 గంటలకు నదీ హారతులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.
మధ్యాహ్నం 1.23 గంటలకు
తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం కాబోతున్నట్లు అలంపూర్ ఆలయాల ఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు. పుష్కరాలు ప్రారంభించేందుకు కీసరి పీఠాధిపతి కమలానంద భారతి, మెదక్ జిల్లా తొగుట పీఠాధిపతి మధుసూదనా ఆనందస్వామి హాజరవుతున్నారని చెప్పారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడులు ప్రారంభ పుష్కరాలకు హాజరు కాబోతునట్లు తెలిపారు.
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు
మండలకేంద్రమైన రాజోలి గ్రామంలో పుష్కరాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక రోజు మాత్రమే వ్యవధి ఉండటంతో.. యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. 16 మరుగుదొడ్లను సిద్ధం చేశారు. 200 వాహానాలకు సరిపడేలా.. మూడు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. స్నానాల వద్ద ప్రమాదం జరగకుండా.. వీఐపీలకు, సాధారణ భక్తులకు వేర్వేరుగా రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు స్తంభాల ఏర్పాటుతో పాటుగా, విద్యుత్తు లేకున్నా వెలుగులు వచ్చేలా సౌరదీపాలను సిద్ధం చేస్తున్నారు. పాత పుష్కర ఘాట్ వద్ద మరమ్మతులు చేస్తున్నారు. వైకుంఠనారాయణ స్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలకు బారిగేట్లు ఏర్పాటు చేశారు. విద్యుత్తు దీపాలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు.
మూడు డిపోల నుంచి 20 ప్రత్యేక బస్సులు
కొవిడ్ నిబంధనలు అనుసరించి తుంగభద్ర పుష్కరాలకు కేవలం 20 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. గద్వాల డిపో నుంచి 10 బస్సులు, వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల నుంచి 5 బస్సుల చొప్పున నడిపేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 20వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా పుష్కరాలు ముగిసే వరకు 20 బస్సులు నడుపనున్నారు. గద్వాల డిపో నుంచి కేటాయించిన ప్రత్యేక బస్సులు రాజోలి ఘాట్ వరకు నడుపుతారు. వనపర్తి, మహబూబ్‌నగర్ డిపోల నుంచి నడిపే 10 బస్సుల్లో 5 పుల్లూరు ఘాట్‌కు, మరో 5 బస్సులు అలంపూర్ ఘాట్ వరకు నడుపుతారు.
రాష్ట్ర పరిధిలో మూడు ఘాట్లకే ఆర్టీసీ బస్సులు నడిపేందుకు నిర్ణయించామని ఆర్‌ఎం ఉషాదేవి తెలిపారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుతం 20 బస్సులు నడిపేందుకే ఆదేశాలున్నాయని, రోజూ తిరిగే బస్సులు యథాతధంగా నడుస్తాయన్నారు. జనం డిమాండ్‌ను పుష్కరాలకు బస్సులు పెంచుతామన్నారు. బస్టాండ్లలోనూ పుష్కరాలకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు, కౌంటర్లు చేయడం లేదన్నారు.
ఇదీ చూడండి: తుంగభద్ర పుష్కర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష