మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో రోడ్డుపక్కన మట్టిలో కలిసిపోతున్న ప్రాచీన విగ్రహాలను పురావస్తుశాఖ పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ సీఈవో బుద్దవనం ప్రాజెక్టు కన్సల్టెంటు డా.ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. సోమవారం పోల్కంపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆయన గ్రామంలో, చెరువుకట్ట దగ్గర పడిఉన్న విగ్రహాలను పరిశీలించారు. కల్యాణ చాళుక్యుల (కీ.శ. 11వ శతాబ్దం) నాటి నాగదేవతలు, నందివీరుల శిల్పాలు రోడ్డు విస్తరణలో మట్టిలో కలిసి కనిపించకుండా పోయే ప్రమాదముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ శిల్పాలతో పాటు.. పాతకాలం నాటి ఆయుర్వేద మందులు నూరుకునే సానరాయి, గుండ్రని కల్వం కూడ మట్టిలో కూరుకుపోతున్నాయి. వీటిని పంచాయతీ కార్యాలయంలో గానీ.. పాఠశాల ఆవరణలో గానీ భద్రపరచాలని గ్రామ సర్పంచికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామ చెరువు కట్టపైనున్న భైరవ, భైరవి, వీరభద్ర, సూర్య భగవానుల విగ్రహాలకు సైతం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో నల్లమల నేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పట్నం కృష్ణంరాజు, భూత్పూరు ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చదువు కోసమొచ్చి.. వ్యభిచారం వృత్తి..