ఉత్తర తెలంగాణలో ప్రభుత్వ పనులు, ప్రాజెక్టులు అభివృధి పథంలో దూసుకుపోతుంటే.. దక్షిణ తెలంగాణలో ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆరేళ్లుగా చేపడుతున్న అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుంటే... అభివృద్ధి జరిగిందంటూ ఇప్పుడు ఏ విధంగా జిల్లా పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఓ వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావొస్తుంటే... జిల్లాలో ప్రభుత్వం శంకుస్థాపన చేసిన పాలమూరు-రంగారెడ్డి, తుమ్మిళ్ల పథకాలకు 20 శాతం నిధులు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో తలపెట్టిన 4 ప్రాజెక్టులూ పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన సరళాసాగర్ కట్ట తెగిపోతే ఇప్పటి వరకు స్పందించలేదని ఆరోపించారు.
రైతుల వద్ద 54 ఎకరాల భూమిని సేకరించి.. యజమానులకు పరిహారం చెల్లించకుండానే మెడికల్ కళాశాల ప్రారంభిస్తున్నారని అన్నారు. పాలమూరులో ఉన్న నిరుపేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామి ఇచ్చి.. ఏదో తూతూ మంత్రంగా కొన్ని ఇళ్లు కట్టిచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'