ఏసీబీకి మరో అవినీతి అధికారి పట్టబడ్డారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్ లక్ష 65 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. పురపాలిక పరిధిలో ఏర్పాటు చేయనున్న క్లోరినేషన్ గ్యాస్ ప్లాంట్‌ను నామినేటెడ్ పద్ధతిలో ఇప్పిస్తానని.. అందుకు గాను 20 శాతం డబ్బులు ఇవ్వాల్సిందిగా కాంట్రాక్టర్‌ను కమిషనర్ డిమాండ్ చేశారు. చివరకు 15 శాతంగా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని... అందులో భాగంగా లక్ష 65 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
క్లోరినేషన్ ప్లాంట్‌కు సుమారు 11 లక్షల విలువ అవుతుండగా... మున్సిపల్ కమిషనర్ 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందిగా కోరాడని కాంట్రాక్టర్ ఆలీ అహ్మద్ ఖాన్ తెలిపారు. గతంలో 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇచ్చేవారమని.. ఇప్పుడు ఏకంగా 20 శాతం అడగడం వల్ల ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: సీసీఎంబీ పరిశోధన: పుట్టగొడుగులతో కరోనాకు చెక్