పచ్చని మొక్కలు, రంగురంగుల పూలు, దాగుడు మూతలాడున్నట్లుగా పలకరించి పారిపోయే పక్షులు.. ఇలా ఎన్నో ప్రకృతి అందాలకు నెలవుగా మారింది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బీఆర్బీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హరితవనం. ఏడు విభాగాల్లో.. 300 జాతులు, 800లకు పైగా మొక్కలతో ఎన్నో ప్రకృతి అందాలకు ఈ సుందరవనం నిలయంగా మారింది. అలంకరణ మొక్కలు తామర, కలువలు, గులాబీ, గోవర్ధనం, నంది వర్ధనం, అలమంద, నూరు వరహాలు ఇలా ఎన్నో రకాలు అక్కడ కనిపిస్తాయి. ఔషద మొక్కల్లో నిమ్మగడ్డి, కుందేటి కొమ్ములు, రుద్రాక్ష, నల్ల ఉమ్మెత్త, శాగ, ఇన్సులిన్, నన్నారి లాంటి జాతులు గార్డెన్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే స్థానీయ మొక్కలూ ఇక్కడ కనిపిస్తాయి. ఎర్రచందనం, హిల్దగార్డియా, బోస్వెల్లియా, డ్రిమియా నాగార్జున, సైకాస్ బెడ్డోమీ లాంటి మొక్కలున్నాయి. నల్లమలలో మాత్రమే కనిపించే పాంక్రాషియం తెలంగానిస్సే, పాంక్రాషియం బ్రమరాంబికే లాంటి మొక్కల్ని కూడా ఇక్కడ పెంచుతున్నారు. పండ్లలోనూ వాటర్ ఆపిల్, వన్ కేజీ సపోట, అన్నిరకాల మామిడి, పనస లాంటివిు ఉన్నాయి. ఎక్కడెక్కడికో వెళ్తేగాని కనిపించని మొక్కలు బీఆర్ఆర్ డిగ్రీ కళాళాల వృక్షవనంలో దర్శనమిస్తున్నాయి.
10 నెలల్లోనే పూర్తి
కేవలం ముప్పావు ఎకరంలో.... 10 నెలల్లోనే ఈ వనం రూపుదిద్దుకుంది. గత ఏడాది ఆగస్టులో చెట్లు, పిచ్చి మొక్కలతో పనికిరాకుండా పడి ఉన్న స్థలాన్ని ఓ సహాయ ఆచార్యుడు సుందరంగా రూపుదిద్దాడు. వృక్షశాస్త్ర విభాగంలో సహాయ ఆచార్యునిగా పనిచేసే సదాశివయ్య.... పర్యావరణంతోపాటు జీవవైవిధ్యాన్ని కాపాడాలన్న తపనతో ఈ గార్డెన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనికిరాని స్థలంగా మిగిలిపోయిన ప్రాంతాన్ని చూస్తుండగానే అందమైన క్షేత్రంగా మార్చి వేశారు. తనొక్కడి తపనతో ఇది సాధ్యంకాదని భావించిన సదాశివయ్య.... ఈ హరితయజ్ఞంలో పలువురిని భాగస్వామ్యం చేశారు. తన వద్దకు గెజిటెడ్ సంతకాల కోసం వచ్చే వారిని మొక్కలను బహుమతిగా ఇవ్వాలని కోరుతాడు. పుట్టిన రోజులు, శుభకార్యాలకు వనానికి ఆహ్వానించి మొక్కలు నాటాల్సిందిగా కోరతారు. ప్రకృతి కోసం ఒక్క రూపాయి పేరిట.. ఏడాదిపాటు 365 రూపాయలు చందా రూపంలో స్వీకరించి.. చందాదారుని పేరుమీద ఓ మొక్కనాటి వాటిని సంరక్షిస్తారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సహా పలువురు ప్రముఖులు ఇక్కడ వందల సంఖ్యలో మొక్కలు నాటారు.
ఐదెకరాల్లో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు శ్రీకారం
ముప్పావు ఎకరంలో హరితవనాన్ని అభివృద్ధి చేసిన స్ఫూర్తితో.. ఐదెకరాల్లో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు సదాశివయ్య. ఎంచుకున్న స్థలానికి సొంత ఖర్చులతో కంచె వేయించారు. పైనుంచి తెలంగాణ ఆకారంలో కనిపించడం ఈ బొటానికల్ గార్డెన్ ప్రత్యేకత. 33జిల్లాలకు సరిహద్దులు గీసుకుని ఏ జిల్లా స్థలంలో.. ఆ జిల్లాకే ప్రత్యేకమైన మొక్కల్ని పెంచనున్నారు. ఒక్కోజిల్లా ఒక్కోరంగులో కనిపించేలా ప్రణాళిక రచించారు. ఐదెకరాలస్థలం, 50లక్షల అంచనా వ్యయంతో మూడేళ్లలో తెలంగాణలో ఎక్కడాలేని బొటానికల్ గార్డెన్ ను జడ్చర్లలో సృష్టిస్తామని సదాశివయ్య చెబుతున్నారు.