60 years celebration in Zilla Parishad School: ఒకే బడిలో చదువుకున్న ఒకే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులంతా, ఏదో ఒక సందర్భంలో సాధారణంగా కలుస్తుంటారు. ప్రత్యేక సందర్భాల్లో నాలుగైదు లేదా పది, పదిహేను బ్యాచులు.. ఒకచోట చేరతారు. కానీ 60ఏళ్లుగా ఆ బళ్లో చదివిన పూర్వ విద్యార్థులంతా, అక్కడ ఒక్కచోటకు చేరారంటే ఆ కలయిక నిజంగా అపూర్వం. మరచిపోలేని జ్ఞాపకం. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల అలాంటి అపూర్వ కలయికకు వేదికైంది.
పాఠశాలను స్థాపించి 60ఏళ్లైన సందర్భంగా, 60వసంతాల వేడుకనుపూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. సుమారు 2వేల మంది, ఆ వేడుకకు హాజరయ్యారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకొని, గత జ్ఞాపకాల్నినెమరువేసుకుని ఆనందంగా గడిపారు. 1962లో మహ్మదాబాద్ ఉన్నతపాఠశాల నుంచి మొదటి హెచ్ఎస్సీ బ్యాచ్ పరీక్షలు రాయగా, ఆ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఉత్సవాలకు హాజరయ్యారు.
చదువు నేర్పిన గురువులు, తమ బతుకుల్ని ఎలా నిలబెట్టారో, చదువు తమ కుటుంబాల్ని ఉన్నతస్థాయికి ఎలా చేర్చిందో అందరితో పంచుకొని ఆనందంతో ఉబ్బిదబ్బిపోయారు. 1962 నుంచి 2021 వరకూ అక్కడ 60 పదోతరగతి బ్యాచ్‌లు చదువు పూర్తిచేసుకున్నాయి. 1962లో హెచ్ఎస్సీ ఉండగా 1969లో తొలి బ్యాచ్ పరీక్షలు రాసింది. అప్పటినుంచి ఇప్పటి వరకు చదువు నేర్పిన గురువుల్ని వేడుకకు ఆహ్వానించిన పూర్వ విద్యార్థులు.. వారిని ఘనంగా సన్మానించారు.
పిల్లల్నిచూసి గురువులు, టీచర్లను చూసి విద్యార్థులు భావోద్వేగాలకు లోనయ్యారు. ఆదినుంచి మహ్మదాబాద్ పాఠశాల తన ప్రత్యేకతను చాటుకుంటూనే వస్తోంది. అక్కడ చదివిన విద్యార్థులు విద్యలోనే కాదు.. క్రీడలు, నాటకాల్లోనూ రాణించారు. అప్పటి ఆటలు, నాటకాల్ని గుర్తు తెచ్చుకున్న పూర్వ విద్యార్థులు.. చిన్న పిల్లలైపోయారు.
60 ఏళ్ల విద్యార్థుల కలయిక తొలి అడుగుమాత్రమేనంటున్న నిర్వాహకులు.. తల్లి లాంటి బడి రుణం తీర్చుకునేందుకు భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. క్రీడలు, ఇతర రంగాల్లో అక్కడి చిన్నారులు రాణించేలా.. వేసవి శిబిరాలు సహా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. 60 ఏళ్ల మహోత్సవాల నిర్వహణకు రెండేళ్ల ముందు నుంచే పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. ప్రతి బ్యాబ్‌నుంచి ఇద్దరు విద్యార్థులను కమిటీలో చేర్చుకొని అందరికీ ఆహ్వానం అందేలా చర్యలు చేపట్టారు. వేడకకు అంతా హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవీ చదవండి: