మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగిలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ప్రతి మంగళవారం 'నిరుద్యోగ దీక్ష'లో భాగంగా సాయంత్రం 6 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు.
అంతకుముందు అదే మండలానికి చెందిన సోమ్లా తండాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ కుటుంబసభ్యులను షర్మిల పరామర్శించారు. కాసేపు వారితో గడిపి.. వారిని ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. అనంతరం గూడూరు మండలం గుండెంగిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వైఎస్ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
రేపు పోడు భూములకై పోరు..
ఈ సందర్భంగా పోడు భూముల సమస్య పరిష్కారం కోసం.. పోడు రైతులకు భరోసా కల్పించేందుకు షర్మిల రేపు ములుగు జిల్లాలో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని చేపట్టనున్నారని పార్టీ నేతలు తెలిపారు. ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం పస్రా గ్రామంలోని కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించి.. లింగాల గ్రామం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వివరించారు. లింగాలలో 'పోడుభూములకై పోరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు.
ఇదీ చూడండి: 8 ఏళ్ల బాలుడిని చితకబాదిన ట్యూషన్ టీచర్... పోలీసులకు ఫిర్యాదు