YS Sharmila Padayatra: పరిపాలన చేయమని అధికారం ఇస్తే.. ధర్నాల పేరుతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా హైదరాబాద్లో... రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస ధిల్లీలో ధర్నాలు చేస్తూ.. ప్రజలను ఆగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర.. పెద్ద కిష్టాపురం గ్రామానికి చేరుకుంది. పాద యాత్రలో దారి పొడవునా మహిళలు, వృద్ధులు, యువతీయువకులు.. పూలతో ఘన స్వాగతం పలికారు. యువనాయకురాలితో యువత సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
యాసంగిలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులతో కలిసి షర్మిల దీక్ష చేపట్టారు. వైస్ రాజశేఖర్ రెడ్డి నాటి సంక్షేమ పాలనను తీసుక వచ్చేందుకే అందరి ముందుకు వచ్చానని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన సంతకం రైతు మరణ శాసనంగా మారిందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా, తెరాస పార్టీలు ధర్నాలలో పోటీలు పడుతున్నారే తప్పా.. రైతులకు మేలు చేసేందుకు కాదని ఆరోపించారు. వడ్లను ఎవరు కొంటారనే దానిలో పోటీ పడాలని హితవు పలికారు.
"వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధరపై 20 శాతం బోనస్ ఇచ్చారు. ఇప్పుడున్న సీఎం కేసీఆర్.. బోనస్ మాట దేవుడెరుగు కనీసం ధరతో అయినా వడ్లు కొనాలని కోరుకుంటున్న రైతులను నట్టేట ముంచుతున్నారు. వాళ్ల విజ్ఞప్తిని పక్కన పెట్టేసి మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. ఎమ్మెస్పీకి 5, 6 వందలు తక్కువకు కొనుగోలు చేస్తూ రైతులను దోచుకుంటున్నారు. రైతుల రక్తం పిండుతున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు.. మాటలు మార్చటమే కేసీఆర్ పని. రుణమాఫీ అని రైతులను, జీరో వడ్డీ అని మహిళలను, కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను, నిరుద్యోగ భృతి అని నిరుద్యోగులను, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని నిరుపేదలను, 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులను, 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని గిరిజనులను, మైనార్టీలను మోసం చేస్తూనే ఉన్నారు." - షర్మిల, వైతెపా అధ్యక్షురాలు
ఇదీ చూడండి: