Stones attack in Demolish: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టిన కూల్చివేత ఉద్రిక్తంగా మారింది. బాధితులు అధికారులు, సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. మహబూబాబాద్ పట్టణ శివారులో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 287/11లో నిర్మాణం చేస్తున్న ఇంటిని కూల్చేసేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులు పోలీసులతో వచ్చారు. అధికారులు అడ్డుకున్న బాధితులు.. వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జేసీబీ వాహనంతో కడుతున్న నిర్మాణాన్ని కూల్చేందుకు సిబ్బంది ప్రయత్నించారు.
ఇంకేముంది.. బాధితులు అధికారుల దగ్గరి నుంచి ఒక్క ఉదుటున జేసీబీ వద్దకు చేరుకున్నారు. చేతుల్లోకి రాళ్లు తీసుకుని జేసీబీపై దాడి చేశారు. అందినంత దూరం జేసీబీని తరిమికొట్టారు. అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంత సమయం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు, నాయకులు, పోలీసులు బాధితులకు నచ్చజెప్పి శాంతపర్చారు. అక్కడ గుమికూడిన స్థానికులందరిని చెదరగొట్టటంతో గొడవ సద్దుమణిగింది.
కూలగొడితే ఊరుకునేది లేదు..
ముప్పై ఐదేళ్ల క్రితం కొని.. తన కూతుళ్లకు వరకట్నం కింద ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వ స్థలమని ఎలా అంటారని బాధితురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దగ్గరున్న పత్రాలను చూపించి.. న్యాయం చేయాలని కోరుకుంది. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకుంటున్న ఇంటిని కూలగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించింది.
"35 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని కొన్నా. నా కూతురుకు కట్నం కింద ఇచ్చిన. ఇప్పుడు ఇళ్లు కట్టుకుంటుంటే.. అధికారులొచ్చి ఇది ప్రభుత్వ జాగా అంటే ఏందన్నట్టు..? దుకాణాల్లో పనిచేస్తూ.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇళ్లు కట్టుకుంటుంటే ఇప్పుడు పోలీసులు, అధికారులు వచ్చి కూల్చేస్తామంటే మా పరిస్థితేంటీ..? మాకున్న ఆధారం ఇదొక్కటే. మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి. దీన్ని లాక్కుంటామంటే ఊరుకునేది లేదు." - బుజ్జి, బాధితురాలు
ఇదీ చూడండి: