ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో జరిగింది. కష్టపడి నిర్మించుకున్న తమ ఇళ్లను కూల్చవద్దని స్థానికులు అధికారులను వేడుకున్నారు. వారి కళ్ల ముందే కూల్చేయడంతో బాధితులు వాపోయారు.
దీంతో అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్లను కూల్చితే ఎక్కడికి పోవాలని ప్రశ్నించారు. పేదలైన ఎస్సీల భూములను లాక్కోవద్దని తహసీల్దార్‌కు విన్నవించారు. గతంలో ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని.. అందుకే ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో జేసీబీని అధికారులు పంపించి వేశారు.