TRS Deeksha for Bayyaram Steel plant : మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలంటూ తెరాస నేతలు డిమాండ్ చేశారు. తెరాస ఆధ్వర్యంలో బయ్యారంలో ఉక్కు నిరసనదీక్షను చేపట్టారు. దీక్షలో ఎంపీ కవిత, జడ్పీ ఛైర్‌పర్సన్ బింధు, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, రాములు నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 'బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు... తెలంగాణపై కేంద్రం సవతి ప్రేమను నిరసించాలి' అంటూ నినాదాలు చేశారు. దీక్షలో తెరాస నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
'రాష్ట్రంపై కేంద్రం కక్ష '
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయకుండా రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న తెరాస... కేంద్రంపై మరో పోరాటం చేస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా... ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ దీక్ష చేపట్టింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ అంశంపై కేంద్రం బృందాలు బయ్యారంలో పలు మార్లు సర్వే చేశాయి. పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, ఇనుప రాయి గుట్ట, నీటి లభ్యత, రైల్వేలైన్, విద్యుత్ సదుపాయం తదితర అంశాలను పరిశీలించాయి. ఈ సర్వేల అనంతరం ఇనుపరాయి నాణ్యత సరిగా లేదంటూ.. కర్మాగారం ఏర్పాటుపై కేంద్రం చేతులెత్తేసింది. తాజాగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాదంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంతో తెరాస నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
ఉక్కు కర్మాగారం రాదని చెప్పడం దారుణం
పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి, విభజన చట్టంలో పొందుపరిచి మరీ కేంద్రం పరిశ్రమ ఏర్పాటు చేయకపోవడంపై చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విమర్శలు చేస్తూ వస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో కర్మాగారం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. పైప్‌లైన్ ద్వారా ముడి ఇనుము సరఫరా చేసినా ఖర్చు భరిస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు స్పష్టం చేశారని తెరాస చెబుతోంది. కర్మాగారం కోసం ప్రయత్నించకుండా... ఇక రాదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పడం దారుణమని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు.
తరలివచ్చిన తెరాస శ్రేణులు
ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు రిలే నిరాహార దీక్షలు, చలో కలెక్టరేట్ తదితర కార్యక్రమాలను చేపట్టగా.... ఇవాళ మరోసారి ఒకరోజు దీక్ష నిర్వహిస్తున్నట్లు తెరాస నాయకులు ప్రకటించారు. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు నినాదంతో తెరాస గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Mallanna Sagar: కాసేపట్లో మల్లన్న సాగర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్