జీహెచ్ఎంసీ ఎన్నికలు 13 , 14 రోజుల్లో పూర్తి కావడం.. ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో జరగలేదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగులతో సమావేశమయ్యారు.
దుబ్బాకలో విపరీతమైన ప్రతికూలతను చవిచూసిన తెరాస.. సమయం ఉంటే ప్రతిపక్షాలన్నీ సమాయత్తం అవుతాయనే భయంతోనే వెంటనే ఎన్నికలను నిర్వహిస్తోందని అన్నారు. అందుకే ప్రభుత్వం పన్నులను మినహాయించడం, వరదబాధితుల పేరుతో తమ పార్టీకి కావాల్సిన వారందరికీ డబ్బు పంపిణీ చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియకు తూట్లు పొడుస్తోందని, ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ వత్తాసు పలుకుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ జీహెచ్ఎంసీ ఎన్నికలకు మరికొంత సమయం ఇవ్వాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల మీద ఒక విశ్వాసం కలిగే విధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించాలని కోరారు.
ఇదీ చదవండి: గ్రేటర్ నగారా: డిసెంబరు 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు