20 ఏళ్ల క్రితం తాను కొనుగోలు చేసిన గృహాన్ని... తిరిగి ఆయనకే దానం చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తిమ్మంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మా తన ఇంటిని అదే గ్రామానికి చెందిన భూక్య నెహ్రూకు 40 వేల రూపాయలకు అమ్ముకున్నాడు. అనంతరం వరంగల్ జిల్లా హన్మకొండకు వలస పోయాడు. అక్కడే రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు.
కూలీ పనులు లేక...
ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధింపుతో కూలీ పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోయాడు. పైగా అనారోగ్యం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న నెహ్రూ ఉదారభావంతో లక్ష్మాను గ్రామానికి పిలిపించాడు. అనంతరం తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎస్సై సతీష్ సమక్షంలో అతడికే తన ఇంటిని దానం చేశాడు. అప్పట్లో రూ. 40 వేలతో కొనుగోలు చేసిన ఆ నివాసం... ప్రస్తుతం రూ. 2 లక్షల 50 వేల ఖరీదు. బాధితుడికి అండగా నిలిచిన నెహ్రూ ఉదారతత్వాన్ని గ్రామస్థులంతా అభినందించారు.