తన పొలంను దున్నిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకుని.. భూమికి నూతన పట్టా పాస్ పుస్తకంను ఇప్పించాలంటూ ఓ రైతు సెల్ టవర్ ఎక్కాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన రైతు చిట్టెబోయిన యాకయ్య నెల్లికుదురు మండలం మీట్యాతండా సమీపంలో తనకున్న 4 ఎకరాల 10 గుంటల భూమిలో ఒక ఎకరం వరి పొలంను నెలక్రితం సాగు చేశాడు. 3 ఎకరాల 10 గుంటల భూమిలో మరో పంట వేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.
ఈ తరుణంలో పొలం వద్దకు అటవీశాఖ అధికారులు వచ్చి అది అటవీశాఖ భూమి అని ... గాయత్రి గ్రానైట్ క్వారీ కిషన్ సార్‌తో మాట్లాడుకోవాలన్నారు. లేని పక్షంలో లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని రైతు యాకయ్య ఆరోపించారు. 2000 సంవత్సరం ముందు నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నానని.. బ్యాంకులో రుణం కూడా తీసుకున్నానని రైతు చెబుతున్నాడు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు వచ్చి పంటను ధ్వంసం చేసి.. భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడం అన్యాయమని అన్నారు. అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకుని..తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కేసముద్రం ఎస్.ఐ సతీష్ సెల్ టవర్ వద్దకు చేరుకుని, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతు కిందకి దిగాడు.
ఇదీ చూడండి : 'ఊరేగింపు ఆపండి... మీ భార్య నేను ప్రేమించుకున్నాం'