గతంలో నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలతో అలరారిన ఆలయాలు నేడు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. కాకతీయులు నిర్మించిన ఆలయాల ఆలన పాలనను పట్టించుకునేవారు కరవయ్యారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల ఆలయాలు శిథిలావస్థకు చేరుతున్నాయి. దంతాలపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో కాకతీయులు నిర్మించిన శివాలయాలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఆలయాలపై చెక్కిన అపురూప శిల్ప కళా సంపద కాలగర్భంలో కలిసిపోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రాచీన కట్టడాలు కనుమరుగైపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కనుమరుగవుతున్న అద్భుత కట్టడాలు
దంతాలపల్లి మండలంలోని రేపోణి, కుమ్మరికుంట్ల, పెద్దముప్పారం, దంతాలపల్లి గ్రామాల్లో కాకతీయుల కాలంలో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు నిర్మించారు. రేపోణి శివారులోని చెరువు బోడుపై ఉన్న ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఆలయ గర్భగుడి వెనుక భాగంలోని పెద్దపెద్ద రాతి బండలు పక్కకు ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు కూలుతుందోననే భయంతో భక్తులు ఆలయంలోకి వెళ్లడానికి జంకుతున్నారు. ఈ ఆలయంలో గతంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయని స్థానికులు తెలిపారు. కుమ్మరికుంట్ల శివారులోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం చుట్టూ ముళ్లపొదలు దట్టంగా పెరిగిపోయాయి. దీంతో భక్తులు ఆలయంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల కొందరు భక్తులు ముందుకొచ్చి ముళ్ల పొదలను తొలగించి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. రెండేళ్ల క్రితం ఆలయంలో దొంగలు పడ్డారు. గర్భగుడి ముందు భాగంలోని నందీశ్వరుడి విగ్రహం వద్ద గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. దీంతో పెద్ద గుంత అలాగే ఉండిపోయింది. పలుమార్లు నిధుల కోసం తవ్వకాలు జరపడంతో ఆలయం ధ్వంసమైంది. ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం నేటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కాకతీయులు ప్రతిష్ఠించిన భారీ నంది విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది.
పెద్దముప్పారం, దంతాలపల్లిలో ఇటువంటి ఆలయాలు ఉన్నప్పటికీ ఆయా గ్రామాల్లోని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో వాటిని పునరుద్ధరించి భక్తులు పూజలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా ఈ ఆలయాల్లో శివరాత్రి వేడుకలు నిర్వహిస్తుంటారు. నిధుల లేమితో ఈ ఆలయాలను పునరుద్ధరించలేకపోతున్నామంటూ ఉత్సవ కమిటీల బాధ్యులు వాపోతున్నారు. కనీసం మహాశివరాత్రి వంటి పర్వదినాల్లోనైనా ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. పెద్దముప్పారంలో భక్తులు ముందుకొచ్చి ఆలయానికి మరమ్మతులు చేసి రంగులతో తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి సుమారు 70 ఎకరాల మాన్యం భూమి ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదు. స్వామి వారి రథం పూర్తిగా శిథిలమైంది. దంతాలపల్లిలో రామలింగేశ్వరస్వామి ఆలయంలోని గాలిగోపురం శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోతుండడంతో గ్రామస్థులు మరమ్మతులు చేశారు. ఆలయంలో గతంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం ఇటీవల ఈదురుగాలులకు కూలిపోయింది. దీన్ని పట్టించుకునేవారే కరవయ్యారు. దంతాలపల్లి, కుమ్మరికుంట్ల ఆలయాల్లో నల్లరాతితో చెక్కి ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నిధులు మంజూరైతే ఆలయాల అభివృద్ధి..
- సునీత, ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల పరిరక్షణ బాధ్యత పురావస్తు శాఖది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 600 ఆలయాలు ఉన్నాయి. వీటిలో ధూపదీప నైవేద్య పథకం కింద కొన్ని ఆలయాలను గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పురాతన ఆలయాల అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. నిధులు మంజూరైతే ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
ఇవీ చూడండి: నేటి నుంచి యాదాద్రిలో పవిత్రోత్సవాలు