Cyber Crime Today in Mahabubabad: సైబర్ మోసగాళ్ల మాటల్లో పడి ఓ మాజీ సైనికుడు 2 లక్షల 30 వేల రూపాయలు పోగొట్టుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణంలోని సిగ్నల్ కాలనికి చెందిన భిక్షపతి అనే మాజీ సైనికుడు ఇటీవలే క్యాన్సర్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం 2 లక్షల 30 వేల రూపాయలు అప్పుగా తీసుకొని ఎస్బీఐ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశాడు. అవసరం అయినప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకుందాం అనుకున్నాడు. ఆరోగ్యం సహకరించక బ్యాంక్‌కు వెళ్లలేకపోయాడు. ఆన్లైన్లో చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మరుసటి రోజు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
![Cyber Crime, Cyber Crime today, సైబర్ క్రైమ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13857047_thaa.png)
క్లిక్ చేశాడు.. బుక్కయ్యాడు..
'మీరు చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కదా. ఓ లింక్ పంపిస్తున్నాం. దాన్ని క్లిక్ చేయండి' అని ఫోన్ కాల్ సందేశం. వెంటనే భిక్షపతి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. ఇలా 5 సార్లు లింక్ ఓపెన్ చేయగా.. అతని ఖాతాలో ఉన్న నగదు అంతా మాయమైంది. కొద్దిసేపటి తర్వాత బ్యాంక్ నుంచి తన ఖాతా నుంచి మెసేజ్ వచ్చింది. తన ఖాతాలో నగదు అంతా మాయమైనట్లు గ్రహించిన భిక్షపతి బ్యాంక్‌కు ఫోన్ చేశాడు. సదరు బ్యాంక్ అధికారులు అతని ఖాతా నుంచి వేరే ఎవరో నగదు బదిలీ చేసుకున్నట్లు చెప్పారు. తాను మోసపోయానని అర్థమైన భిక్షపతి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బీ కేర్‌ఫుల్
Mahabubabad Cyber Crime News : చికిత్స కోసం అప్పు చేసిన డబ్బంతా సైబర్ కేటుగాళ్లు దోచుకున్నారని తన డబ్బు తనకు ఇప్పించాలని బాధితుడు పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా సైబర్ కేటుగాళ్ల చేతిలో అమాయకులు ఎంతో మంది మోసపోతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవీ చదవండి :
- ఆ మెసేజ్‌లతో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీనే!
- వాట్సాప్‌లో ఆ లింక్‌లను క్లిక్ చేస్తే.. ప్రమాదంలో పడ్డట్లే..!
- Cyber Crime: ఆధార్‌తో పాన్‌కార్డు లింక్ చేశారా? క్లిక్ చేస్తే చిక్కే!
- ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్.. రుణాలిస్తామని కోట్లల్లో మోసం
- Cybercriminals: బావ డేటా ఇస్తే.. బామ్మర్ది లూటీ చేశాడు!