మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గిరిజనుల ముఖ్య పండుగ తీజ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. బయ్యారం మండలం బాల్యతండాలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బిందు వేడుకల్లో పాల్గొన్నారు. దేశంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేక స్థానముందని బిందు అన్నారు. నేటి హైటెక్ యుగంలోనూ తండాల్లో గిరిజనులు తమ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారన్నారు. ఈ ఏడాది కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గిరిజన కన్యలకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గిరిజన యువతులు, మహిళలు తీజ్ వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. తమకు మంచి వరుడు దొరకాలని, పాడి పంటలు బాగుండాలని తండాల్లో గిరిజన యువతులు కోరుకుంటారు. వెదురు బుట్టల్లో గోధుమ నారు పోసి ఆ బుట్టలను తండాలోని దేవాలయం సమీపంలో ఓ మంచెను వేసి దానిపై ఉంచుతారు.
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యువతులు స్నానం ఆచరించి.. గోధుమ నారు పోసిన ఆ వెదురు బుట్టలకు నీళ్లు పోసి భక్తీ శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ఆ వెదురు బుట్టల్లో గోధుమ మొలకలు రాగానే 9 రోజులపాటు సాయంత్రం వేళ పాటలకు నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతారు. మంచె చుట్టూ తిరుగుతూ సంబురాలు జరుపుకుంటారు. చివరి రోజు తండాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గోధుమ నారు బుట్టలతో తండాలోని వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుకుంటూ బుట్టలను చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
ఇదీ చూడండి : గూగుల్‌పే, ఎనీ డెస్క్, పేటీఎం పేర్లతో లక్షలు స్వాహా