ఒకరు కాదు ఇద్దరు కొడుకులున్నారు. నాకేంటిలే పెద్దయ్యాక నన్ను వాళ్లే చూసుకుంటారనే గర్వం అతనిది. పిల్లలే సర్వస్వం తనకి. కష్టపడి ముగ్గురు పిల్లలకు ఏ కష్టం రాకుండా.. ఉన్నంతలో మంచిగా చూసుకున్నాడు. వారికి పెళ్లిళ్లు కూడా చేశాడు. వయసు పైన పడుతున్నా.. పిల్లలపై భారం వేయకుండా.. భార్యతో హాయిగా జీవించాడు. పదేళ్ల క్రితం భార్య చనిపోయాక అర్థమైంది. తాను ఒంటరి అయిపోయాడని. పిల్లలు కూడా తనను భారం అనుకుంటున్నారని.
ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధైర్యంగానే ఉన్న వ్యక్తి.. అనారోగ్యంతో ఉన్నా తనను చూసేందుకు కూడా పిల్లలు రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. మనోవేదనతో కృంగిపోయాడు. నిలువునా దహిస్తున్న తన ఆలోచనలు తాళలేక.. 90 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి చనిపోయాకైనా పిల్లలకు అతని విలువ అర్థం కాలేదు. కనీసం అంత్యక్రియలు చేసేందుకు కూడా ముందుకు రాలేదు.
మహబూబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం కంఠాయపాలెంలో ఈ హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నసాయిలు (90)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహాలయ్యాయి. కుమారులు మల్లయ్య, ఎల్లయ్య కరీంనగర్‌లో కూలి పని చేసుకుంటున్నారు. సాయిలు భార్య పదేళ్ల కిందట మరణించింది. నాటి నుంచి సాయిలు ఒంటరిగా ఉండేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. తనను ఎవరూ చూడటంలేదని మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కంఠాయపాలెంకు చేరుకున్నారు. దహన సంస్కారాలు చేయడానికి ఇద్దరూ ముందుకురాలేదు. నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. సర్పంచి శ్రీపాల్‌రెడ్డి, కానిస్టేబుల్ సాయికిరణ్‌లు కౌన్సెలింగ్ చేయడంతో కుమారులిద్దరూ మంగళవారం సాయంత్రం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి: Harish comments on Piyush Goyal: 'అన్నదాతలకు పీయూష్ గోయల్ క్షమాపణలు చెప్పాలి'