గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల దుకాణాలు తెరచుకోవడానికి అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో అధికారులు చర్యలు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీ కేటగిరీలో ఉన్న సుమారు వెయ్యికి పైగా వివిధ రకాల దుకాణాలకు అధికారులు సరి, బేసి విధానంలో మార్కింగ్ చేశారు.
ఏ కేటగిరిలో ప్రస్తుతం నడుస్తున్న కిరాణం, మందులు, కూరగాయలు, పాల ఉత్పత్తులతో పాటు భవన నిర్మాణం, వ్యవసాయ అనుబంధ దుకాణాలు రోజూ తెరచుకునేందుకు అనుమతించారు. బీ కేటగిరిలో ఉన్న సెల్ఫోన్ దుకాణాలు, వస్త్ర దుకాణాల, జ్యువెలరీ, పుస్తకాలు తదితర దుకాణాలు సరి, బేసి విధానంలో తెరచుకోవాలని సూచించారు.
దుకాణాలకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. సీ కేటగిరిలో ఉన్న విద్యాసంస్థలు, బార్లు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఎట్టి పరిస్థితుల్లో తెరవ కూడదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి