రహదారి విస్తరణ వెడల్పును కుదించాలంటూ మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మున్సిపాలిటీలో విలీనమైన శనిగపురంలో రోడ్లను 100 ఫీట్లకు విస్తరించాలని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. దానికనుగుణంగా అధికారులు మార్కింగ్ చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకొని మహబూబాబాద్- తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
ఈ రహదారి విస్తరణ వల్ల సుమారు 35 ఇళ్లు నేల మట్టం కానున్నాయి. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని గ్రామస్థులు తెలిపారు. పట్టణంలో రహదారులు 60 నుంచి 70 ఫీట్లు మాత్రమే ఉండగా... గ్రామాల్లో 100 ఫీట్లతో రోడ్లను ఏవిధంగా విస్తరిస్తారని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని... రోడ్డు విస్తరణను కుదించాలని కోరారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వెంకటరత్నం, ఎస్సై రమేశ్‌బాబు గ్రామానికి చేరుకొని బాధితులకు నచ్చచెప్పగా ఆందోళన విరమించారు.