మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్ పర్యటించారు. అనంతరం మండల పరిధిలోని మేచరాజుపల్లి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
కరోనా కేసులు తక్కువే..
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని.. అమెరికా, మహారాష్ట్రలో దీని తీవ్రత చాలా అధికంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిందన్నారు. వలస కూలీల రాకతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా మెలగాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో కరోనా సోకలేదన్నారు. వర్షాకాలంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం !
పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్యం పాటించని వారిపై జరిమానా విధించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ఉపాధిహామీ పథకం కూలీలను వినియోగించుకోవాలన్నారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ రైతు బంధుకు రూ.7 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
వ్యవసాయం.. రైతు సంక్షేమం
తెలంగాణ సోనా రకాన్ని రైతులు సాగు చేసుకోవాలని మంత్రి కోరారు. అధిక దిగుబడితో పాటు సన్న రకానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం గోదాంల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కొత్త మండలాల్లో 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాంలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మేచరాజుపల్లిలో రూ.ఒక కోటి నిధులను సిమెంటు రోడ్లకు మంజూరు చేశామన్నారు. ఆకేరు వాగుపై నాలుగు చెక్‌డ్యాంలు మంజూరు చేశామని.. త్వరలోనే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామంలో రోడ్లు వేయట్లేదు ?
ఎస్సారెస్పీ జలాల కోసం తాను పోరాటాలు చేసి జైలుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతున్న సమయంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు లేవని, తండాలకు తారు రోడ్డు వేయడం లేదని, మిషన్ భగీరథ జలాలు అందటం లేదని, పారిశుద్ధ్య పనులు చేపట్టట్లేదంటూ గ్రామస్థులు మంత్రి దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు. మండలంలోని ఓ తండాకు రోడ్డు నిర్మాణం చేపట్టని గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెట్టాలంటూ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకుంఠ ధామాల నిర్మాణం..
గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని.. దాని ఫలాలు మనకు అందబోతున్నాయని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యవతి తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. కరోనా నియంత్రణకు అందరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.
బీద శాఖలకు నిధులివ్వరూ ?
గిరిజన, శిశు సంక్షేమ శాఖలు రెండూ బీద శాఖలేనని మంత్రి సత్యవతి అన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి వీటికి అధిక శాతం నిధులు మంజూరు చేయాలని మంత్రి ఎర్రబెల్లిని కోరారు. త్వరలో వరంగల్, మహబూబాబాద్ జిల్లా అధికారులతో సమీక్షించి.. వానాకాలంలో రెండు పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి : విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలా : హైకోర్టు