RS Praveen Kumar: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న పోలేపల్లి శరణ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతురాలు రాసిన లేఖ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
శరణ్య కుటుంబానికి జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పెద్దమనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీ విషయం యువతి ప్రాణాలు పోయాక బయటికి వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా పోలీసులకు తెలియకుండా చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
"నిర్మల్ జిల్లాలో రెండు పడక గదుల ఇల్లు ఇప్పిస్తానని తెరాస నేత అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రగతి భవన్లో గడీల పాలన కొనసాగుతోంది. గడీల పాలనతో తెలంగాణ ఛిద్రం అయింది. యువతి మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. పంచాయితీ నిర్వహించిన పెద్దమనుషులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి. శరణ్య కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుంది."
-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్
ఇదీ చదవండి: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత