రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు కర్షకుల కష్టాలను రెట్టింపు చేశాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోయారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలు నీటిపాలయ్యాయి. కురవి, నేరడ, మొదుగుల గూడెం, రాజోలు, కాంపెల్లి, తాళ్ల సంకీస, కొత్తూరు-సీ, మొగిలిచర్ల, చింతపల్లి, అయ్యగారిపల్లిలో కొనుగోలు కేంద్రాలు వర్షపునీటితో నిండిపోయాయి. వరంగల్ గ్రామీణ జిల్లాలో నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి సహా పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు నీటమునిగాయి. ములుగు జిల్లాలోని జంగాలపల్లి, వెంకటాపూర్, గోవిందరావుపేట, పస్రాలో ధాన్యం కుప్పలు తడిసిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపించాయి. వడ్ల బస్తాలపై టార్పాలిన్లు కప్పినా లాభం లేకపోయిందని రైతులు వాపోయారు.
వరదలో ధాన్యం కుప్పలు... దీనస్థితిలో రైతన్నలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. అన్నదాతల్ని నిండాముంచాయి. పోచంపల్లి మండలం గౌసుకొండ, శివారెడ్డిగూడెం, రామలింగంపల్లి, దోతిగూడెంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. టార్పాలిన్ కప్పి వడ్ల బస్తాలు తడవకుండా ఉంచేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. నల్గొండ జిల్లా చండూరు, నాంపల్లి, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు వరదలో మునిగాయి. తూకం వేసిన బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల.. నెల నుంచి కొనుగోళ్ల జాప్యం జరిగిందని... ఇప్పుడు నిండా మునిగిపోయామని రైతులు వాపోయారు. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు-ఎస్ మండలం తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో.. వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.
అన్నదాతల ఆవేదన
మెదక్ జిల్లాలో చాలా మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నిజాంపేట మండలం చల్మెడ రైతులు రాస్తారోకో చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించకపోవడం వల్ల తడిసిపోయిందని వాపోయారు. పోలీసులు, తహసీల్దార్ నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు. నార్సింగ్ మండలం షేర్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పరిస్థితి దారుణంగా తయారైంది. 70మంది రైతులకు చెందిన 150 ధాన్యం కుప్పలు నీటమునిగాయి. నెల క్రితమే ధాన్యం తెచ్చామని.. తూకం వేయాలని ఎన్నిసార్లు బతిమాలినా... వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
నీళ్లలోనే సుప్రభాత సేవ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ రైతులకు నష్టం వాటిల్లింది. ఖమ్మం, కొణిజర్ల, కామేపల్లి, ఏన్కూరు, కూసుమంచి మండలాల్లో భారీ వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన వడ్ల బస్తాలు తడిసిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గుండాల వాగు పొంగి ప్రవహించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి బాలాలయంలోకి పెద్దఎత్తున నీరు చేరింది. మెట్లదారి గుండా, క్యూ లైన్లలోకి ప్రవహించింది. స్వామివారికి సుప్రభాత సేవ నీళ్లలోనే నిర్వహించారు.
ఇదీ చదవండి: RAINS: రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు