Rains Effect: జనవరిలో ఉరుముల్లేని పిడుగులా వచ్చిపడ్డ అకాల వర్షాలు.. కర్షకులను నష్టాల పాలుచేశాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు.. పలుచోట్ల రైతులను నిండా ముంచాయి. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మహబూబాబాద్ , గంగారం, కొత్తగూడ, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. చేతికి అందివచ్చిన మిరప, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. మిరప కల్లాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వడగండ్ల కారణంగా మక్క చెట్లు సగానికి విరిగి నేలకొరిగాయి. మిరప చెట్ల నుంచి మిర్చి మొత్తం నేలరాలింది.
తడిసిన మిర్చిని చూసి లబోదిబోమన్న రైతులు.. చేసేదిలేక నీటి నుంచి ఏరుకున్నారు. పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిచి ముద్దయ్యాయి. అకాల వర్షాలతో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామర, ఇతర తెగుళ్ల కారణంగా ఇప్పటికే కొంతమేర నష్టపోగా.. వడగండ్ల కారణంగా మిగత పంట నాశనమైందని మిరపరైతులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: