రుతుపవనాల ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో మూడురోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుసిన వానలకు జిల్లాలోని వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. మహబూబాబాద్ శివారులో ప్రవహిస్తున్న మున్నేరు వాగు, గూడూరు శివారులో ప్రవహిస్తున్న పాకాల వాగు, కేసముధ్రం మండలంలోని వట్టివాగు, నెల్లికుదురు మండలంలోని ఆకేరు వాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.
బయ్యారం పెద్ద చెరువు నిండి.. ఉధృతంగా అలుగు పోస్తుంది. గార్ల శివారులోని పాకాల చెక్ డ్యామ్ పైనుండి వరద నీరు ప్రవహించడం వల్ల గార్ల నుంచి రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు 15 కిలోమీటర్ల చుట్టూ తిరిగి గార్ల చేరుకుంటున్నారు. చెరువులు, కుంటలు నిండి.. వాగులు పొంగి పొర్లడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్