మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని అంతర్జాలం ద్వారానే ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేసి పది మందిని అరెస్టు చేశారు. మరో అయిదుగురు పరారీలో ఉండగా.. 12 మందిని గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.
విలాసవంతమైన జీవితం గడిపేందుకు కొంతమంది పెడదారి పడుతుందనడానికి ఇటీవల జిల్లాలో వెలుగు చూస్తున్న ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శ్రమ లేకుండా సులభంగా డబ్బులు ఆర్జించే మార్గాలను ఇందుకు అన్వేషిస్తున్నారు. బాలుడి హత్యకేసులో నిందితుడితో పాటు అతడి మిత్రులు, పట్టణంలోని శనిగపురం ప్రాంతానికి చెందిన కొంతమంది గాకుండా పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన చరవాణుల్లో ఇలాంటి క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం లాంటి యాప్‌లున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. యాప్‌లనే కాకుండా అక్రమ వ్యాపారాలకు సంబంధించి లావాదేవీలు చరవాణి ద్వారానే నడిపిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ఇవి ఒకరి నుంచి మరొకరు డౌన్‌లోడ్ చేసుకోడమే కాకుండా తమ అక్రమ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరికొంతమంది యువతను ఈ మార్గం వైపు ఆకర్షించుకునేందుకు పలువురు తమ యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటివాటిపై జిల్లా పోలీస్ శాఖ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు..
జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కొన్ని కేసుల్లో విచారణ చేస్తున్న సందర్భంగా వారి చరవాణులను తనిఖీ చేసినప్పుడల్లా బయట పడుతున్నాయన్నారు. ఈ అక్రమ దందా, జూదాల్లో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.- నంద్యాల కోటిరెడ్డి, జిల్లా ఎస్పీ
ఇదీ చదవండి: నగదు దొరికినా నాటకాలేంటి: హరీశ్‌రావు