మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి గ్రామానికి చెందిన శంకు శరత్, తొర్రూరుకు చెందిన బరోచేయ అశ్విన్,మైలారానికి చెందిన మాలిక్ రమేష్, పాక అశోక్…ఈ నలుగురూ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. అడ్డదారుల్లో సంపాదించడానికి గంజాయి అమ్మకాన్ని మార్గంగా ఎంచుకున్నారు. సీలేరు, ఒడిశాల్లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొని…గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు గడించటం మొదలు పెట్టారు.
గంజాయి రవాణా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు జమాండ్లపల్లి చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. సోదాలను గమనించిన వారు ఖాకీల కళ్లుగప్పి తప్పించుకునేందుకు యత్నించారు. పారిపోతున్న గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 60కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.6లక్షలు ఉంటుందని అంచనా. రెండు వానాలను సీజ్ చేశారు. ముఠాలోని ముగ్గురిని అరెస్ట్ చేయగా..పాక అశోక్ పరారీలో ఉన్నాడని తెలిపారు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి. అతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.
మహబూబాబాద్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ…గంజాయి రవాణా ముఠాను అరెస్ట్ చేసిన సిబ్బందిని అభినందించి, రివార్డులను అందించారు. డీఎస్పీ నరేష్ కుమార్, సి.ఐ వెంకటరత్నం, ఎస్సై రమేష్,సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: పండగకు బట్టలు కొనేందుకు వెళ్లి... అనంతలోకాలకు...