మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, జేవీఆర్ ఉద్యాన పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రాలను రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. కేవీకేలోని వివిధ రకాల విత్తనాలు, తేనెటీగల పెంపకం, మట్టి నమూనా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం ఉద్యాన శాఖ నర్సరీని సందర్శించి.. జామ, మామిడి మొక్కల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ముదిరిన మామిడి తోటలకు ఫ్రూనింగ్ చేసి పునర్జన్మ సాధ్యమేనని చేసిన ప్రయోగం ఫలితం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. మిర్చికి సంబంధించి నూతన రకాల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.
కేవీకేలో మట్టి, నీటి నమూనాలను పరీక్షించి రైతులకు అందిస్తున్నారని, దీనివల్ల ఎరువుల వాడకం తగ్గుతుందన్నారు. మల్యాల గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.