మేడారం మహాజాతరలో తొలి ఘట్టం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పొనుగొండ్ల నుంచే ప్రారంభమవుతుంది. పొనుగొండ్ల పుత్రుడైన పగిడిద్దరాజు పెళ్లికొడుకుగా ముస్తాబై మేడారానికి బయల్దేరడంతో ఉత్సవాలు మొదలవుతాయి. సమ్మక్క-పగిడిద్దరాజు కల్యాణానికి... ఊరంతా కలిసి డోలు వాద్యాలతో పగిడిద్దరాజును మేడారానికి తీసుకొస్తారు.
ఈ వేడుకల్లో భాగంగా... పొనుగొండ్ల ప్రజలు తమ ఇంళ్లకు మట్టిపూతలు పూసి, ముగ్గులతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని శుభ్రం చేసి ఆదివారం నుంచే పూజలు ప్రారంభించారు. మంగళవారం నాడు గుట్ట నుంచి స్వామివారిని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించి శాంతి పూజలు నిర్వహిస్తారు.
పెన్క వంశీయులు పగిడిద్దరాజు పడగను తయారుచేసి ఆదివాసీ సంప్రదాయాలతో గ్రామాన్ని కట్టడి చేస్తారు. మంగళవారం నాడు పగిడిద్దరాజును తీసుకొని అడవి మార్గంలో కాలినడకన మేడారానికి బయలుదేరుతారు. ఈ నెల 5న మేడారం చేరుకుని గద్దెలపై స్వామివారిని ప్రతిష్టిస్తారు. 6 నాడు గద్దెకు సమ్మక్క చేరికతో మహాజాతర సంపూర్ణంగా ప్రారంభమవుతుంది. సమ్మక్క, పగిడిద్దరాజుల కల్యాణం అంగరంగ వేభవంగా నిర్వహిస్తారు. 7న భక్తుల దర్శనానంతరం.. 8 నాడు సాయంత్రం వనదేవతల తిరుగుప్రయాణంతో మహాజాతర ముగుస్తుంది.
ఇదీ చూడండి: మహాజాతరకు ముందే జనజాతర