కేంద్రంలో భాజపా రెండోసారి అధికారంలోకి రావడం వల్ల తెలంగాణలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు రాబోతున్నాయని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు మహబూబాబాద్‌లో అన్నారు. రాష్ట్రంలో తెదేపాకు భవిష్యత్తు లేనందున మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఆదివాసీల సమస్యల పరిష్కారం భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు.
ఆదివాసుల పోరాటానికి భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుందని.. తమతో కలిసి రావాలని కోరారు. ఆదివాసుల సమస్యలపై ప్రతినిధి బృందాన్ని దిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు.