మహబూబాబాద్ జిల్లాలో సెప్టెంబరు 21న రేగడితండా సమీపంలో జరిగిన పెయింటర్ ఇన్నారపు నవీన్ హత్య కేసు మిస్టరీ వీడింది. పట్టణంలోని మంగలికాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ భార్యకు వెంకటేశ్ అనే వ్యక్తితో రెండు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయమై తరచూ భార్యభర్తలకు ఘర్షణ జరుగుతుండేది. భర్త నవీన్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన శాంతి భర్తను అంతం చేసేందుకు పథకం రచించింది.
అనుకున్న పథకం ప్రకారం.. తన తల్లిగారింటికి వెళ్లి మటన్ తీసుకురావాలని నవీన్‌కు చెప్పగా అతడు స్కూటీపై రేగడితండాకు బయలుదేరాడు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు వెంకటేశ్, అతడి స్నేహితుడు పద్దం నవీన్ రేగడితండా సమీపంలో కాపుకాసి స్కూటీపై వస్తున్న నవీన్‌ను ఆపి రోడ్డు పక్కకు తీసుకెళ్లి ఇనుప రాడ్‌తో తలపై బలంగా మోదారు. మెడకు రుమాలుతో ఉరివేసి పాశవికంగా హత్య చేశారు. అనంతరం స్కూటీని నవీన్ మృతదేహంపై పడేసి హత్యను ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించారు.
మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ వెంకటరత్నం, కురవి ఎస్సై శంకర్‌రావు దర్యాప్తు ప్రారంభించగా ఘటనాస్థలం వద్ద లభించిన ఆధారాలతో పాటు మద్యం సీసాపై ఉన్న బార్ కోడ్, సెల్‌ఫోన్ సంభాషణల ఆధారంగా దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. డీఎస్పీ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో వేగంగా కేసును ఛేదించిన సీఐ వెంకటరత్నం, ఎస్సై శంకర్‌రావు, సిబ్బందిని అభినందించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.