పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పల్లా ఎమ్మెల్సీ కాక ముందు ప్రైవేటు విద్యాలయానికి అధిపతని.. ఆ తరువాత విశ్వవిద్యాలయానికి అధిపతయ్యారని విమర్శించారు. మరోసారి గెలిస్తే విద్యాశాఖ మంత్రి అవుతారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. తెరాస నుంచి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు, కాంగ్రెస్ సానుభూతి పరుడు రవికి మౌనం పాటించి నివాళులు అర్పించారు.
తోడుగా పంపాలి..
శాసనమండలిలో తానొక్కడినే ఒంటరిగా ఉన్నానని.. రాములు నాయక్‌ను, చిన్నారెడ్డిని గెలిపించి తనకు తోడుగా పంపాలని కోరారు. పల్లాను మంత్రిగా చేసి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాములు నాయక్ గిరిజన బిడ్డని, తెలంగాణ ఉద్యమ నాయకుడని.. పట్టభద్రులు ఆలోచించి గెలిపించాలని కోరారు.
ఎందుకు మాట్లాడరు..
మూడేళ్ల కాలంలో మూడు కొలువులు భర్తీ చేయలేదని విమర్శించారు. గిరిజన రిజర్వేషన్లపై మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్ నాయక్ ఎందుకు మాట్లాడరని పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం వారి వైఫల్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రామచంద్రునాయక్, ఆరు మండలాల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఓటమి భయంతోనే తెరాస కొత్త వ్యక్తిని బరిలో దింపింది: కిషన్‌రెడ్డి