ప్రజా కవి, ప్రకృతి ప్రేమికుడు, గాయకుడు గొడిశాల జయరాజు తల్లి అచ్చమ్మ సంస్మరణ సభ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. " మా తల్లుల చరిత్రలే ఈ దేశ చరిత్రలు " అనే నినాదంతో నిర్వహించారు. ఈ సభకు మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, కవులు, కళాకారులు హాజరయ్యారు. అచ్చమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సభలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారి సామాజిక మాధ్యమంలో వైరల్గా మారాయి.
ఆ పార్టీని ఉద్దేశించేనా..
'ఒక లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పరిధిలోనే బతకాలి. సింగరేణిలో పనిచేస్తూ ఇంకో దగ్గర పని చేస్తా అంటే కుదరదు. బయటికి వెళ్లాలి అంటే ఇంకో లిమిటెడ్ కంపెనీలోకి వెళ్లాలి. ప్రస్తుతం నేను ఇది లిమిటెడ్ కంపెనీ అని భావించి ఉంటున్నా. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు చాలా మంది దూరమయ్యారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పాటలు మారిపోయాయి. వ్యక్తుల చుట్టూ పాటలు పాడాల్సిన పరిస్థితి వచ్చింది. కలాలు.. గళాలు మౌనంగా ఉంటే అది క్యాన్సర్ కంటే ప్రమాదం. ఆలోచించాల్సిన సమయం వచ్చింది' అని రసమయి అన్నారు. ఈ మాటలన్నీ అధికార పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్లుగా అంతా భావిస్తున్నారు.
ఇదీ చూడండి: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం : వినయ్ భాస్కర్